రెడ్ క్రాస్ సొసైటీ.. భద్రాద్రి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

కలం, ఖమ్మం బ్యూరో: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ సేవలకు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో కొత్త ఊపిరి లభించింది. సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్‌లో నిబంధనల ప్రకారం నిర్వహించిన జిల్లా శాఖ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిశాయి. నూతన చైర్మన్‌గా డాక్టర్ ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల బాలయోగి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా వై. సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వీరితో పాటు మరో 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించిన అధికారులకు నూతన కమిటీ అభినందనలు తెలియజేసింది.

నూతన పాలకవర్గానికి కలెక్టర్ శుభాకాంక్షలు..

​ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ అంకిత్, రెడ్ క్రాస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మానవీయ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. పాల్వంచలో ఐఆర్‌సీఎస్‌కు కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ​

సేవలను మరింత చేరువ చేయాలి..

అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణ అందించే ప్రథమ చికిత్సపై సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు, ప్రజలకు రెడ్ క్రాస్ సేవలను మరింత చేరువ చేయాలని కోరారు. కలెక్టర్ సూచనలపై స్పందించిన నూతన కమిటీ సభ్యులు, జిల్లా శాఖ అభివృద్ధికి, సేవా కార్యక్రమాల విస్తరణకు అందరి సమన్వయంతో కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>