కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ కోసం ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha ) ఖైరతాబాద్ లో పోటీ పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ బరిలో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమేనని.. చేతలు మాత్రం శూన్యం అని కవిత ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్ భూముల పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. అంతా లోపాయికారీ ఒప్పందాలు జరుగుతున్నాయని కేటీఆర్ తో సహా ఏ ఫామ్ హౌస్ లపై చర్యలుండవని టీఆర్ఎస్ చీఫ్ (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య వ్యవస్థపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందరికి అందుబాటులో వైద్యం ఉంటుంది అని చెప్పే నిమ్స్ ఆసుపత్రిలో ఘోర పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఆఫీసు నుంచి ఫోన్ వస్తే తప్ప బెడ్ దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. నిమ్స్ లో సామాన్యుడికి ఆక్సిజన్ బెడ్ అవసరమైతే 4 నుంచి 7 రోజులు వేచి చూడాల్సిన దుస్థితి ఉందన్నారు. బెడ్లు అందుబాటులో లేక వీల్ చైర్ లో కూర్చోబెట్టి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉన్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

