కలం, కరీంనగర్: వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం (Chakali Ilamma Statue Inauguration) ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం కేవలం ముక్కుబడి ప్రక్రియగా మలిచిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ వర్గం నాయకులు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పరం కేకలు వేసుకుంటూ నెట్టుకోవడంతో పరిస్థితి రసాబాసగా మారింది. ఈ తోపులాటలో ఒకరిపై బీజేపీ నాయకులు దాడి చేశారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలను చెదరగొట్టి తీవ్ర ఉద్రిక్తతను నివారించారు. ఈ సంఘటనతో స్థానికంగా కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.

