గర్రెపల్లి పాఠశాలలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్.. పెద్దపల్లి ఎమ్మెల్యే కీలక హామీ

కలం, పెద్దపల్లి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, విద్యార్థుల అభ్యున్నతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) చింతకుంట విజయరమణ రావు (Chinthakunta Vijaya Ramana Rao) స్పష్టం చేశారు.

​మంగళవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Garrepalli ZPHS) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, ‘హరే రామ కృష్ణ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ విజయరమణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

​అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావు (Vijaya Ramana Rao) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయం, ఇతర పనులకు వెళ్లిపోవడం వల్ల పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఉదయం పూట అల్పాహారం తినలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. వారంలో ఆరు రోజుల పాటు ఇడ్లీ-సాంబార్, పూరీ-ఆలూ కుర్మా, దోస, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, బోండాతో పాటు పాలను పోషకాహారంగా అందిస్తున్నట్లు వివరించారు.

​రూ. 70 కోట్లతో పాఠశాలల రూపురేఖలు మార్చాం..

పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటివరకు రూ. 70 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కాంపౌండ్ వాల్స్, నూతన భవనాలు, ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెరగడంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివస్తున్నారని పేర్కొన్నారు.

​రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

నియోజకవర్గంలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఏడాది కాలంలో పనులన్నీ పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను ఒకే ప్రాంగణంలోకి తెచ్చి అందరికీ సమాన, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. భవిష్యత్తులో ఓదెల ప్రాంతంలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు, గ్రామస్తుల కోరిక మేరకు గర్రెపల్లి పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : విద్యార్థులతో కలిసి సీఎం విజయ్ టిఫిన్.. తమిళనాడులో విప్లవాత్మక నిర్ణయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>