కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకెళ్తున్న సీఎం విజయ్ (CM Vijay) మరో విప్లవాత్మక నిర్ణయాన్ని అమలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత అల్పాహార (కామరాజర్ బ్రేక్ఫాస్ట్) పథకాన్ని సీఎం విజయ్ మరింత విస్తరించారు. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకే పరిమితమైన ఈ పథకాన్ని ఇకపై 6 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించిన సీఎం విజయ్.. నేడు చెన్నైలోని తిరువాన్మియూర్ గాంధీ గ్రామం కార్పొరేషన్ పాఠశాలలో ఈ పథకం విస్తరణకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
దీంతో ఈ పథకం విస్తరణ ద్వారా కొత్తగా 15,454 పాఠశాలల పరిధిలోని సుమారు 15.30 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్లో అదనంగా రూ. 217.63 కోట్లను కేటాయించింది. దీంతో విద్యార్థుల ఉచిత అల్పాహార పథకం మొత్తం వార్షిక బడ్జెట్ ఏకంగా రూ. 724 కోట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం విజయ్ పాఠశాల విద్యార్థుల మధ్య కూర్చొని స్వయంగా అల్పాహారం చేశారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి చదువుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించి, ఆకలి రహిత వాతావరణంలో ఉత్తమ విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు.

