epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మైలేజా? డ్యామేజా? హాట్ టాపిక్ గా KCR అటెండెన్స్

కలం, డెస్క్ : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ (KCR) హాజరవుతారా? సాగునీటి ప్రాజెక్టులపై జరిగే చర్చలో పాల్గొంటారా? కాంగ్రెస్‌ వైఫల్యం అంటూ చేసిన విమర్శను ఆధారాలతో వేదికపై వివరిస్తారా? తోలు తీస్తా.. డైలాగును మాటలకే పరిమితం చేస్తారా? తొలి రోజు అటెండెన్స్ తోనే సరిపెట్టుకుంటారా? ఇలాంటి సందేహాల నడుమ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌రావును నియమించడం చర్చకు దారితీసింది. కేసీఆర్ అటెండ్ కాకుండా ఆయన తరఫున గొంతును హరీశ్‌రావు వినిపిస్తారనేదానికి తాజా నియామకం నిదర్శనం అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హరీశ్‌రావు అసెంబ్లీలో చర్చలో లేవనెత్తాల్సిన అంశాలపై కసరత్తు ముమ్మరం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి బాధ్యులెవరో గణాంకాలు, ఆధారాలతో వివరించి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

పార్టీకి లాభమా? నష్టమా?

ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా-గోదావరి జలాలపై అసెంబ్లీలో జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొంటే పార్టీకి ఎలా అడ్వాంటేజ్‌గా మారుతుంది? పాల్గొనకపోతే ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది? ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. పార్టీ ఆఫీస్‌లో, మీడియా సమావేశాల్లో, బహిరంగ వేదికలపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయన ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇదే వాయిస్‌ను అసెంబ్లీ వేదికగా వినిపిస్తే చరిత్రలో రికార్డు అవుతుందనే వాదన తెరమీదకు వచ్చింది. ఆ డైలాగులన్నీ కేవలం పొలిటికల్ స్టేట్‌మెంట్లుగా మిగిలిపోకుండా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగలాలంటే అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలన్నది కొందరి వాదన. అసెంబ్లీకి హాజరై చర్చలో పాల్గొంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నెరవేర్చినట్లే కాక బీఆర్ఎస్‌కు సైతం భారీ స్థాయిలో మైలేజ్ తీసుకొస్తుందని లేదంటే అంతే స్థాయిలో డ్యామేజ్ కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు.

హుందాతనంతో పాటు సార్ధకత :

బీఆర్ఎస్ పాలనలోని పదేండ్లలో పాలమూరు జిల్లా పచ్చబడ్డదని, రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని తరచూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణా జలాల్లో పాలమూరు వాటాను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని KCR కామెంట్ చేశారు. ఈ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సభకు హాజరై చర్చలో పాల్గొని ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చర్చలో పాల్గొనకపోతే భయపడి రాలేదనే విమర్శను కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఆధారాల్లేకుండా, అర్థం లేని తీరులో మీడియా సమావేశాల్లో మాట్లాడి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే నింద కూడా వస్తుంది. ఎలాగూ జిల్లాల్లో బహిరంగసభలు పెడతానని హామీ ఇచ్చిన దృష్ట్యా అసెంబ్లీలో తోలు తీస్తా… లాంటి మాటలకు తగినట్లుగా అర్థవంతమైన వాదనలను వినిపించి ఆ తర్వాత జనంలోకి వెళ్తే సార్ధకత, జవాబుదారీతనం ఉండేదన్న మాటలూ గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టుతో మెసేజ్ :

అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకుడిగా హరీశ్‌రావును (Harish Rao) నియమించడంతో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో ఆయనే పాల్గొంటారనే మెసేజ్ ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్ తరపున ఆయనే గొంతు విప్పుతారని ఆ పార్టీ నేతలూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కేసీఆర్ సభకు హాజరు కావడం అనుమానమేననే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం హరీశ్‌రావుపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలోనే కామెంట్లు చేశారు. “మీ పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.. మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారు? మీకేమైనా పార్టీ పదవి ఉన్నదా? సభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్నారా?” ఇలాంటి కామెంట్లతో తాజాగా కేసీఆర్ కల్పించిన బాధ్యతతో ఆయనకు ఒకింత భరోసా లభించినట్లయింది. పార్టీలో తగిన ప్రాధాన్యత ఆయనకు లేదంటూ అభిమానుల్లో కొందరు గుసగుసలుగా మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం.

Read Also: వీధి కుక్కలకు ‘నో ఎంట్రీ’

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>