కలం, వెబ్ డెస్క్ : భారత్, పాకిస్తాన్ (India – Pakistan) దేశాల మధ్య దౌత్యపరమైన సంప్రదాయం కొనసాగుతున్నది. నూతన సంవత్సర వేళ ఇరు దేశాలు తమ అణు స్థావరాల జాబితాను, అలాగే తమ జైళ్లలో మగ్గుతున్న ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా వస్తున్న ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ ఈ కీలక ప్రక్రియను పూర్తి చేశాయి.
భారత్ , పాకిస్తాన్ (India – Pakistan) మధ్య 1988లో కుదిరిన ‘అణు స్థావరాలపై దాడుల నిషేధ ఒప్పందం’ ప్రకారం ఈ మార్పిడి జరిగింది. యుద్ధం వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒకరి అణు కేంద్రాలపై మరొకరు దాడులకు పాల్పడకూడదనేది ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 1991 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన మేరకు, ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఇరు దేశాలు తమ అణు స్థావరాల జాబితాను పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జరిగిన మార్పిడి వరుసగా 35వది కావడం విశేషం.
అణు స్థావరాల జాబితాతో పాటు, 2008 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను కూడా వెల్లడించాయి. ఈ వివరాల ప్రకారం పాకిస్తాన్ కస్టడీలో మొత్తం 257 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 58 మంది పౌర ఖైదీలు కాగా, 199 మంది మత్స్యకారులు ఉన్నారు. భారతదేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 424 మంది పాక్ జాతీయులు ఉన్నారు. వీరిలో 391 మంది పౌర ఖైదీలు, 33 మంది మత్స్యకారులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ వివరాల మార్పిడి సందర్భంగా భారతదేశం పాకిస్తాన్‌కు ఒక కీలక విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే శిక్షా కాలం పూర్తి చేసుకున్న 167 మంది భారతీయ ఖైదీలను, మత్స్యకారులను మానవతా దృక్పథంతో త్వరగా విడుదల చేయాలని కోరింది. అలాగే, జాతీయత ధృవీకరణ పెండింగ్‌లో ఉన్న మరికొందరి వివరాలను త్వరగా తేల్చాలని సూచించింది.
Read Also: ఖురాన్ మీద ప్రమాణం చేసి బాధ్యతల్లోకి..
Follow Us On: Sharechat


