కలం, వెబ్‌డెస్క్: వేగం, సౌకర్యం కలగలిపి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైళ్లు వందే భారత్. ఇప్పుడు ఈ రైళ్లు మరో కొత్త రూపంలో పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటి వరకు వీటిలో కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణించే వీలుండగా, సుదూర ప్రాంతాలకు అనుగుణంగా బెర్త్‌లతో కూడిన వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా – గువాహటి మధ్య ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) గురువారం వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైలు మరో 20 రోజుల్లోగా ప్రారంభమమవుతుందని తెలిపారు.
ప్రస్తుతం కోల్‌కతా–గువాహటి మధ్య విమాన ప్రయాణానికి టికెట్ రూ.6వేలు ఉండగా, వందే భారత్ స్లీపర్(Vande Bharat Sleeper) లో మీల్స్‌తో కలపి థర్డ్ ఏసీలో రూ.2300, సెకండ్ ఏసీలో రూ.3వేలు, ఫస్ట్ ఏసీలో రూ.3,600 ఉండొచ్చని చెప్పారు. కాగా, ఇప్పటికే వందే భారత్ స్లీపర్ ట్రైన్ టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తయ్యింది. కోటా(రాజస్థాన్), నాగ్దా(మధ్యప్రదేశ్) మధ్య గరిష్ఠంగా 180 కి.మీ వేగంతో జర్నీ చేసింది. రైలు గరిష్ఠ వేగంతో వెళుతుండగా నీళ్లు నింపిన గ్లాస్‌లను ఒకదానిపై ఒకటి ఉంచినా అందులోని నీళ్లు తొణకలేదని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తన ‘ఎక్స్’ అకౌంట్లో పోస్ట్ చేశారు. 16 బోగీల వందే భారత్ స్లీపర్‌లో మోడ్రన్ బెర్త్‌లు, సప్పెన్షన్ సిస్టమ్, టాయిలెట్స్, నిప్పును గుర్తించే వ్యవస్థ, సీసీ కెమెరాలు ఉన్నాయి.
Read Also: డ్రగ్స్ తీసుకుని డీజే ఆపరేట్.. ఐదుగురి అరెస్ట్
Follow Us On: Instagram


