కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. కృత్రిమ మేధ అన్ని రంగాల మీద ప్రభావం చూపుతోంది. ఇక గత ఏడాది (2025)లో ఏఐ ప్రభావం గణనీయం. అన్ని రంగాల్లో ఏఐ ప్రభావం (AI Impact) స్పష్టంగా కనిపించింది. వాటిలో ఏఐ దెబ్బకి తల్లడిల్లిన రంగం ఏదైనా ఉందంటే అది ఐటీ అనే చెప్పాలి. ఎందుకంటే 2025లో భారీగా లే ఆఫ్స్ జరిగాయి. దానికి సంస్థలు పెట్టిన పేరు ‘కాస్ట్ కటింగ్’. కృత్రిమ మేధస్సు టెక్ రంగాన్ని వేగంగా మార్చుతోంది. ఒకవైపు ప్రొడక్టివిటీ పెరుగుతున్నా మరోవైపు ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2025లో కూడా టెక్ పరిశ్రమలో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల తొలగింపు కొనసాగుతోంది.
లేఆఫ్స్. ఎఫ్‌వైఐ (Layoffs.fyi) అనే సంస్థ ప్రకటించిన గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 551 టెక్ కంపెనీల్లో 1.22 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇప్పటికే ఏఐ ప్రభావంతో (AI Impact) తొలగించారు. ఇటీవల లేఆఫ్స్ వేగం కొంత తగ్గినప్పటికీ, వాటి ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టుతున్న పెద్ద కంపెనీల్లో ఉద్యోగ కోతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అమెజాన్ అక్టోబర్‌లో తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌ను ప్రకటించి సుమారు 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది. మైక్రోసాఫ్ట్ 2025 నాటికి మొత్తం 15 వేల ఉద్యోగాలను తొలగించింది. ఇంటెల్ కూడా తన ఉద్యోగుల సంఖ్యను 15 శాతం వరకు తగ్గించేందుకు సిద్ధమవుతోంది. భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం (దాదాపు 12 వేల ఉద్యోగాలు) తగ్గించింది. అయితే ఈ కోతలు నేరుగా AI కారణంగా మాత్రమే జరగలేదని, నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మారుతున్న వ్యాపార అవసరాలు కూడా ఒక కారణమని సంస్థ స్పష్టం చేసింది.
సేల్స్‌ఫోర్స్ AI సహాయంతో 4 వేల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను తగ్గించింది. ప్రస్తుతం సంస్థలో దాదాపు 50 శాతం పనులు AI ద్వారానే నిర్వహిస్తున్నామని CEO మార్క్ బెనియోఫ్ వెల్లడించారు. ఇదే బాటలో ఆపిల్, గూగుల్, మెటా, HP, వెరిజోన్, సీమెన్స్ వంటి సంస్థలు కూడా వందల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI ఆటోమేషన్ వల్ల పునరావృత పనులు తగ్గుతుండగా, ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని AIతో కలిసి పనిచేసే దిశగా మారాల్సిన అవసరం ఏర్పడింది. AI టెక్నాలజీ టెక్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం ఇది పెద్ద సవాళ్లను విసురుతోంది.
Read Also: కొత్త ఏడాదిలో కొత్త రూల్స్… మిస్ అయితే తప్పదు మూల్యం
Follow Us On: Youtube


