కలం, ఖమ్మం బ్యూరో : అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పులిగుండాలను (Puligundala) తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. అడవుల సంరక్షణ, అభివృద్ధిలో వన సంరక్షణ సమితుల (వీఎస్‌ఎస్) పాత్ర కీలకమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండల పరిషత్తు ఆవరణలో నూతనంగా నిర్మించిన వీఎస్‌ఎస్ సమావేశ మందిరాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కనకగిరి, పులిగుండాల (Puligundala) అటవీ ప్రాంతం సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు దీటుగా వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అడవులను కాపాడుకుంటూనే, స్థానిక గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా ఎకో-టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వన సంరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం పులి గుండాల విహార యాత్ర కోసం రెండు వాహనాలను ప్రారంభించి, సమితి సభ్యులకు కుటీర పరిశ్రమల యూనిట్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు.
Read Also: బెంగాల్ తరువాత తెలంగాణపైనే ఫోకస్ : బండి సంజయ్
Follow Us On: Instagram


