కేటీఆర్ ‘యువ సమర భేరీ’ అట్టర్ ఫ్లాప్: కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ కార్యక్రమం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్  ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యువత సమస్యలు గుర్తుకురాని కేటీఆర్‌కు, అధికారం కోల్పోయిన తర్వాతే ‘యువ సమర భేరీ’ పేరుతో యువత గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. శనివారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని  మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బండి సంజయ్ గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. కార్యకర్త స్థాయి నుంచి ప్రజల మధ్య నిరంతరం పోరాడుతూ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అయితే, కేటీఆర్ మాత్రం కుటుంబ రాజకీయ వారసత్వంతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని విమర్శించారు. “ఒకరు ప్రజల మధ్య నుంచి ఎదిగిన జననేత అయితే.. మరొకరు కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారసుడు” అని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు ఎన్నికల సమయంలో వచ్చి రాజకీయ డైలాగులు చెబుతున్నారో స్పష్టంగా గమనిస్తున్నారని కొలగాని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో యువతకు ఇచ్చిన హామీలు, చేసిన అన్యాయాలను కేటీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల సమస్యలు, ఆత్మహత్యలపై అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీవ్ర విమర్శలకు గురైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

యువకులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసి, వారి జీవితాలతో చెలగాట మాడారని కొలగాని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలు, పేపర్ లీకేజీల వ్యవహారాలతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 317 జీవో కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యం తోనే యువత భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని శ్రీనివాస్ ఆరోపించారు. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యువతను పట్టించుకోని కేటీఆర్.. అధికారం పోయిన తర్వాతే ‘యువ సమర భేరీ’ తో మళ్లీ రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారు” అని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ చేసిన కృషి , కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు ప్రజలకు తెలుసన్నారు. శాతవాహన యూనివర్సిటీకి 12బీ హోదా, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు అటానమస్ హోదా సాధించడంలో బండి సంజయ్ కృషి కీలకమని తెలిపారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి, నగరంలోని మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు అందేలా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ తెచ్చిన నిధులెన్ని? ఆయన ప్రశ్నించారు.కరీంనగర్ అభివృద్ధిపై మాట్లాడుతున్న కేటీఆర్.. ముందుగా తాను ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతమేరకు నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. “పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్.. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నయాపైసా తెచ్చినవా?” అని ఆయన నిలదీశారు.

కేసీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వారు ఎంపీలుగా ఉన్నప్పుడు కరీంనగర్‌కు ఏవిధమైన నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కొలగాని డిమాండ్ చేశారు. ఎన్ని సభలు పెట్టినా, ఎంత పెద్ద రాజకీయ నినాదాలు చేసినా యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్ చరిత్రను కరీంనగర్ ప్రజలు మరిచిపోరన్నారు.. కేటీఆర్ రాజకీయ విమర్శలు మాని, పదేళ్ల పాలనలో ప్రజలకు యువతకు జరిగిన అన్యాయాలపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తున్నారో, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు వస్తున్నారో ప్రజలు ఇప్పటికే స్పష్టంగా అర్థమైందన్నారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు బోయిన్ పల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, భూపతి రవీందర్, మేకల వెంకటేష్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, కర్రే అనిల్, పొన్నం మొండయ్య, కొలిపాక శ్రీనివాస్, సాధినేని మునిందర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>