కలం, జోగులాంబ గద్వాల: విద్యాపరంగా వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇతర అతిథులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రసంగించారు.
ప్రపంచంలో ప్రస్తుతం అనేక రంగాల్లో ఎంతో వేగవంతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను వినియోగించి విద్యార్థులకు అత్యుత్తమ బోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదివరకు ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థ అధ్యయనానికి జిల్లా కలెక్టర్‌తో పాటు కొంత మంది ఉపాధ్యాయులు అక్కడ పర్యటించినట్లు గుర్తు చేశారు. స్ఫూర్తి కార్యక్రమంతో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాక మెరుగైన మార్కులు పొందాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే గాక టీచర్ల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో గతంలో సాగునీటి వసతులు లేక చాలా కుటుంబాలు ఉపాధి కోసం వలసలు వెళ్లే వారని, ప్రస్తుతం అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపించడం తగదని, విద్యతోనే ఉన్నత రంగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని సూచించారు.
జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కూడా విద్యార్థులకు బోధించేందుకు చాలామంది ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలో నర్సింగ్, మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయని, భవిష్యత్తులో అనేక ఉన్నత విద్యాసంస్థలను కూడా నెలకొల్పి జిల్లాను విద్యారంగంలో శిఖర స్థాయిలో నిలబెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్వత్ గద్వాల ఖ్యాతి నిలబెట్టేందుకు ఉపాధ్యాయులందరూ తోడ్పాటు అందించాలని కోరుతూ ప్రతి గురువుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర అతిథిలతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభవన్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించిన లోగోను, పోస్టర్లను అతిథులు ఆవిష్కరించారు. అలాగే హెల్త్ కార్డులను విడుదల చేసి పలువురు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరినీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, డీఈవో విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

