కలం, వెబ్‌డెస్క్: లక్నో ఫాల్కన్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అరుదైన రికార్డు సృష్టించాడు. యూపీ టీ20 లీగ్ చరిత్రలో 400 డాట్ బాల్స్ దాటిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆగస్టు 23న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డీఎల్ఎస్ పద్ధతిలో లక్నో ఫాల్కన్స్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ప్రస్తుత సీజన్‌లో భువనేశ్వర్‌కు ఇది ఐదో మ్యాచ్. ఇప్పటివరకు యూపీ టీ20లో 35 మ్యాచ్‌లు ఆడాడు. 124 ఓవర్లలో 408 డాట్ బాల్స్ వేశాడు.
భువనేశ్వర్ నాలుగు సీజన్లలోనూ లీగ్‌లో ఆడాడు. తొలి సీజన్‌లో 118 డాట్ బాల్స్ వేశాడు. రెండో సీజన్‌లో 120 డాట్ బాల్స్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మూడో సీజన్‌లో 117 డాట్ బాల్స్ సాధించాడు. ప్రస్తుత నాలుగో సీజన్‌లో ఇప్పటివరకు 53 డాట్ బాల్స్ వేశాడు. దీంతో మొత్తం సంఖ్య 408కి చేరింది. ఇక నోయిడా కింగ్స్‌పై లక్నో బౌలింగ్‌లో అభినందన్ సింగ్ కీలకంగా నిలిచాడు. అతడు 32 పరుగులకు 4 వికెట్లు తీశాడు.
అభినందన్ ప్రదర్శనతో నోయిడా కింగ్స్ 156/8కే పరిమితమైంది. లక్నో ఫాల్కన్స్ 17.3 ఓవర్లలో 144/5 వద్ద ఉన్న సమయంలో వర్షం వచ్చింది. డీఎల్ఎస్ ప్రకారం లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నాలుగు వికెట్ల ప్రదర్శనతో అభినందన్ సింగ్ సీజన్ 4 పర్పుల్ క్యాప్‌ను తిరిగి అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో అతడు వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ రికార్డు, అభినందన్ అద్భుత బౌలింగ్‌తో లక్నో ఫాల్కన్స్ విజయాన్ని అందుకుంది.

