పీఆర్సీ, డీఏల కోసం ఉద్యోగుల పోరుబాట

కలం, కరీంనగర్ బ్యూరో: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయిస్ (Employees Protest) జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 27న ఉదయం 10 గంటలకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకోవాలని కోరారు. “విజయమో–వీరస్వర్గమో” అనే సంకల్పంతో మహాధర్నా నిర్వహించి ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలను బలంగా వినిపిస్తామని తెలిపారు.

ఉచితాలు కాదు.. హక్కులు అడుగుతున్నాం

ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉచితాలు, దానధర్మాలు కోరడం లేదని, తమకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను మాత్రమే అడుగుతున్నామని దారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సహాయ నిరాకరణ, పెన్‌డౌన్ వంటి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉద్యోగులకు ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఆరు డీఏలు పెండింగ్

ప్రతి ఆరు నెలలకు డీఏ, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్, ప్రతి ఐదు సంవత్సరాలకు పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగులకు పీఆర్సీ అమలు కాలేదని, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరారు.

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. రిటైర్మెంట్ అనంతరం పిల్లల వివాహాలు, ఇళ్ల నిర్మాణం, వైద్య ఖర్చులు తదితర అవసరాల కోసం ఉద్యోగులు జీవితాంతం దాచుకున్న సొంత డబ్బులను పొందేందుకు కూడా ధర్నాలు చేయాల్సి రావడం, న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును సకాలంలో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో మరింత ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని దారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి మహాధర్నా, నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంప్లాయిస్ జేఏసీ సెక్రటరీ జనరల్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘేం లక్ష్మణరావు, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మేందర్ సింగ్, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రామ్మోహన్, తూముల తిరుపతి, కేశవరెడ్డి, ప్రభాకర్ రావు తదితర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>