కలం, నిర్మల్: డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో బ్రీత్ ఎనలైజర్ లో పర్సంటేజీ నమోదై విధులకు దూరమైన నిర్మల్ (Nirmal) డిపో అద్దె బస్సు డ్రైవర్ల (Bus Drivers)ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ టీజీఆర్‌టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ కు అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎండీ ఫయాజ్ మాట్లాడుతూ.. నిర్మల్ డిపోలో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేస్తూ ప్రతిరోజూ విధులకు హాజరవుతూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
విధులకు హాజరయ్యే ముందు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించకపోయినా బ్రీత్ ఎనలైజర్ లో సాంకేతిక లోపాల కారణంగా పర్సంటేజీ నమోదైందని, దీంతో వారిని విధుల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ వృత్తే ప్రధాన జీవనాధారమని, విధులకు దూరం కావడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ లో సాంకేతిక కారణాలతో పర్సంటేజీ నమోదై విధులకు దూరమైన అద్దె బస్సు డ్రైవర్ల విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

