కలం, వెబ్‌డెస్క్: హాకీ వరల్డ్ కప్ (Hockey World Cup) 2026లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 5-3తో ఓడిపోయింది. దీంతో భారత్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. అమ్స్‌టెల్వీన్‌లో జరిగిన పూల్-ఈ చివరి మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మ్యాచ్ ప్రారంభమైన 39 సెకన్లకే అర్జెంటీనా గోల్ చేసింది. జోక్విన్ టోస్కానీ భారత్ డిఫెన్స్‌ను తప్పించుకుని గోల్ చేసి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యం అందించాడు.
ఆ తర్వాత కూడా అర్జెంటీనా ఒత్తిడి కొనసాగించింది. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించగా.. నికోలస్ డి లా టోర్రే దాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ వెనుకబడినా వెంటనే స్పందించింది. పదో నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ గోల్ చేశాడు. ఎడమ వైపు నుంచి వచ్చిన పాస్‌ను అందుకున్న సుఖ్‌జీత్.. డీ లోకి వెళ్లి డిఫెండర్‌ను తప్పించుకుని బంతిని గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ లోటును 1-2కు తగ్గించింది.
మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో క్వార్టర్‌లో భారత్‌కు కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మార్చలేకపోయింది. భారత్ పాస్‌లలోనూ తప్పిదాలు కనిపించాయి. అర్జెంటీనా డిఫెన్స్ వాటిని అడ్డుకుంది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి స్కోరు 2-1గానే ఉంది. అయితే సెమీఫైనల్ ఆశలు నిలవాలంటే భారత్ రెండో అర్ధభాగంలో పెద్ద మార్పు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే అర్జెంటీనా మళ్లీ దూకుడు పెంచింది. మూడో నిమిషంలో టోమస్ డొమెనే శక్తివంతమైన షాట్‌తో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 3-1కు చేరింది. భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా డిల్‌ప్రీత్ సింగ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అర్జెంటీనా డిఫెన్స్ ఒత్తిడి మధ్య వచ్చిన అవకాశాన్ని అతడి షాట్ గోల్‌కు కొద్దిగా దూరంగా వెళ్లింది. మూడో క్వార్టర్ చివర్లో అర్జెంటీనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది.
భారత డిఫెన్స్‌లో జరిగిన తప్పిదాల తర్వాత అర్జెంటీనా మరో అవకాశం సృష్టించింది. భారత గోల్‌కీపర్ మొహిత్ హెచ్‌ఎస్ వరుసగా రెండు సేవ్‌లు చేసినా.. మూడో ప్రయత్నంలో భారత ఆటగాడి కాలికి బంతి తగలడంతో అర్జెంటీనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. టోమస్ డొమెనే ఆ అవకాశాన్ని గోల్‌గా మార్చాడు. దీంతో అర్జెంటీనా 4-1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
నాలుగో క్వార్టర్‌లో భారత్ పుంజుకోవాలని ప్రయత్నించింది. కానీ అర్జెంటీనా మరోసారి గోల్ చేసింది. ఎనిమిదో నిమిషంలో లూకాస్ టోస్కానీ గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 5-1కు పెంచాడు. భారత్‌కు రెండో అర్ధభాగంలో ఐదు పెనాల్టీ కార్నర్లు లభించినా.. ఒక్కదానినీ గోల్‌గా మార్చలేకపోయింది. ఇది భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. అయితే మ్యాచ్ చివరి నిమిషాల్లో భారత్ రెండు గోల్స్ చేసింది. 14వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ మరోసారి గోల్ చేశాడు. దీంతో స్కోరు 2-5గా మారింది.
మ్యాచ్ చివరి నిమిషంలో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. హార్దిక్ సింగ్ దాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ స్కోరు 3-5కు చేరింది. అయితే అప్పటికే సమయం ముగిసే దశకు చేరడంతో భారత్‌కు మ్యాచ్‌ను సమం చేసే అవకాశం లేకపోయింది. చివరికి అర్జెంటీనా 5-3తో విజయం సాధించింది. ఈ ఓటమితో భారత్ పూల్-ఈలో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. అంతకుముందు భారత్ ఇంగ్లండ్ చేతిలో 4-2తో, నెదర్లాండ్స్ చేతిలో 2-0తో ఓడిపోయింది. పూల్-ఈలో భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం లేకుండా పోయింది. ఇక ఏడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో భారత్ సహ ఆతిథ్య దేశమైన బెల్జియంతో తలపడనుంది.

