కలం, ఖమ్మం బ్యూరో: గిరిజనుల హక్కులను కాపాడుతూనే అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ (Jatothu Hussain Nayak) అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో ఆయన పర్యటించారు. అటవీ-రెవెన్యూ భూ సమస్యలపై క్షేత్రస్థాయి విచారణ జరిపి, అధికారులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు.
15 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలి..
ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న 250 ఎకరాలకు పైగా ఉన్న ‘అంబాసత్రం’ భూములు రికార్డుల్లో కనిపించకపోవడంపై ఆరా తీశారు. ఓవర్‌ల్యాప్ అయిన ప్రాంతాలను తక్షణమే పునఃసర్వే చేసి 15 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాధితులు, అధికారుల సమక్షంలోనే పారదర్శకంగా జాయింట్ సర్వే నిర్వహించి ఆధారాలు నమోదు చేయాలని, గిరిజనులపై అనవసరంగా కేసులు పెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
త్వరలోనే సమగ్ర తుది నివేదిక..
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. పాత సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, భూ రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కూనారం భూ సమస్యపై త్వరలోనే సమగ్ర తుది నివేదిక రూపొందిస్తామన్నారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి వివాదాలను కూడా రాబోయే 6-7 నెలల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు.
జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు హక్కులు కల్పించామని చెప్పారు. కూనారం సమస్యతో పాటు అంబాసత్రం భూముల రికార్డులను పునఃపరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ.. అయిదారేళ్లుగా నలుగుతున్న ఈ సమస్యను అన్ని శాఖల సమన్వయంతో పరిష్కరించి, అర్హులైన గిరిజనులకు కచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ శిరీష, ప్రజాప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.

