కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా కొల్లూర్ (Kollur) పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ ఘటన కలకలం రేపింది. రాత్రి వేళలో ఒంటరిగా వెళ్తున్న ఓ వ్యక్తిని తొమ్మిది మంది దుండగులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం బాధితుడి పర్సును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. పర్సులో రూ.4,700 నగదు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారంతో దాడికి పాల్పడిన తొమ్మిది మంది ముఠాలోని ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నిందితుల వివరాలను వెల్లడించగా, మిగిలిన నలుగురు మైనర్లుగా గుర్తించారు. వారిని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

