కలం, వనపర్తి: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Karne Thanda Lift Irrigation) ను సోమవారం రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మోటార్లు ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వనపర్తి జిల్లాలో 3,384 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందనుంది. 18 తండాల పరిధిలోని రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టుకు వారి ఇష్టదైవమైన సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఏటా రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నా ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రాజెక్టు కోసం 245 ఎకరాల భూసేకరణ: మల్లు రవి
కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.87.53 కోట్లు ఖర్చు చేశామని, 245 ఎకరాల భూసేకరణ చేపట్టామని తెలిపారు. గత పాలకులు పలు ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పినా పెండింగ్‌లో ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసి కర్నెతండా పరిధిలోని భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రాంతంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పెండింగ్ పనులు పూర్తి చేశాం: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
గత ప్రభుత్వ హయాంలో కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.87 కోట్లతో జీఓ తీసుకువచ్చినా సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేసి పనులు మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ పనులను చేపట్టి ఇప్పటివరకు సుమారు రూ.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మరో రూ.11 కోట్లు భూసేకరణ, ఇతర పెండింగ్ పనులకు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ.2,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మార్కండేయ ప్రాజెక్టుతో పాటు కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. కర్నెతండా ప్రాజెక్టుకు సంత్ సేవాలాల్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం వనపర్తి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సర్జ్‌పూల్ వద్ద నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

