కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో, కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఇకపైన కామెంట్లు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. అది పార్టీకి సంబంధించిన వ్యవహారమైనందున నాయకత్వం, అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఇప్పటివరకు జరిగిన సంగతి ఎలా ఉన్నా ఇకపైన మాత్రం ఎవ్వరూ పెదవి విప్పొద్దని స్పష్టం చేశారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రెండు గంటలకు పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగం చేయొద్దని, వాటిపై ఓపెన్ స్టేట్‌మెంట్‌లు ఇవ్వొద్దన్నారు. ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ, పీసీసీ, ఏఐసీసీ దానిపై ఫోకస్ పెట్టాయని గుర్తుచేశారు. ఎంత వద్దనుకున్నా కొన్నివైపుల నుంచి సంకేతాలు, ఊహాగానాలు అంటూ మీ చెవిన పడుతుంటాయని, వాటిని నమ్మొద్దన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏ రూపంలోనూ స్పందించొద్దని స్పష్టం చేశారు.
‘ఇన్‌స్టా’ను విస్తృతంగా వాడాల్సిందే :
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులంతా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారని, ఇక నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడా యాక్టివ్‌గా ఉండాలని, సంక్షేమ పథకాల ప్రోగ్రెస్‌తో పాటు ప్రభుత్వ విజయాలను కూడా ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఇక నుంచి ప్రతీ ఎమ్మెల్యే వారి పరిధిలోని నీటి పారుదల ప్రాజెక్టులు, వాటికి అవసరమైన భూ సేకరణ పనులు వెంటవెంటనే జరిగేలా చొరవ తీసుకోవాలని, ఆయా విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టాస్క్ పూర్తయ్యేలా చూడాలన్నారు. భూసేకరణ ఎంత ఆలస్యమైతే ప్రాజెక్టులు అంత నత్తనడకన నడుస్తాయని, ప్రజల అవసరాలు తీరవని వివరించారు. భూసేకరణకు అవసరమైన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, కానీ ఆ పనులు పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవడమే తరువాయి అని వివరించారు. ఇప్పటి నుంచి నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

