కలం, వెబ్డెస్క్: మీడియా సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారంపై ఎమ్మెల్యేలు సీఎంతో చర్చించనున్నారు. అలాగే పార్టీలో పలువురు నాయకుల క్రమశిక్షణ ఉల్లంఘనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతల నుంచే కొండా సురేఖకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, సీఎంకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలే డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎంతటి నాయకులైనా క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని పలువురు నాయకులు హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి మరోసారి సమావేశమై కొండా సురేఖ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

