కలం, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) లో దీపు చంద్ర దాస్ (Deepu Chandra Das) దారుణ హత్యపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనిని చంపడానికి దైవదూషణ కారణం కాదని, అసూయతోనే ఈ అకృత్యానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. బంగ్లాలోని మెమైన్సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే హిందువును దారుణంగా హత్య చేసి, చెట్టుకు వేలాడదీసి, తగలబెట్టిన సంగతి తెలిసిందే. అసలు ఆ రోజు ఏం జరిగిందో ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ‘దీపు కష్టపడి పనిచేసేవాడు. పనిలో అందరికంటే మెరుగ్గా ఉండేవాడు. అదే అతనిపై మిగిలినవాళ్లకు అసూయ కలిగించింది. అందుకే దీపును చంపేశారు. దీనికి దైవదూషణ కారణం కాదు.
మొదట దీపును బలవంతంగా హెచ్ఆర్ గదిలోకి పంపి, రాజీనామా చేయించారు. వాళ్లవెంట బయటివ్యక్తులూ ఉన్నారు. అందరూ కలసి దీపును ఫ్యాక్టరీ బయట ఉన్న గుంపునకు అప్పగించారు. వాళ్లు దీపును చుట్టుముట్టి, రాక్షసుల మాదిరి ప్రవర్తించారు. తల, మొహం, ఛాతీపై పిడిగుద్దులు గుద్దారు. కర్రలతో చితకబాదారు. రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదు. అలాగే కొట్టి చంపి, మృతదేహాన్ని దాదాపు కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరితీసి, వేలాడదీసి, తగలబెట్టారు. ఇదంతా చేసింది ఆ వర్గంవాళ్లే’ అని ఓ ప్రత్యక్షసాక్షి వెల్లడించారు.
‘మేమంతా అక్కడే ఉన్నాం. అడ్డుకోవాలని ప్రయత్నించాం. కానీ, వాళ్లు మమ్మల్ని కూడా చంపేస్తారని భయపడి ఆగిపోయాం. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాం’ అని వ్యక్తి తెలిపాడు. ‘మేం అవామీలీగ్ (షేక్ హసీనా పార్టీ) మద్దుతుదారులమని వాళ్లు దాడులు చేయలేదు. మేము హిందువులమనే వాళ్లు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం వాళ్లే మాతో చెప్పారు’ అని అతను వెల్లడించాడు. దీపు దాస్ హత్య తర్వాత అతను నివాసం ఉంటున్న గ్రామంలోని హిందువులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, రెండు రోజుల కిందట బంగ్లాదేశ్ (Bangladesh) లోని రాజ్బరి జిల్లాలో అమృత్ మండల్ అనే మరో హిందూ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ హత్యలు, దాడులన్నీ మతం వల్ల కాదని, వేరే కారణాలతో జరుగుతున్నాయని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంటోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకూ భారత వ్యతిరేక అల్లర్లు, నిరసనలు బంగ్లాదేశ్లో ఎక్కువవుతున్నాయి.
Read Also: మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది.. అమెరికాకు చైనా వార్నింగ్!
Follow Us On: Sharechat


