కలం, వెబ్ డెస్క్: ఈ నెల 29 (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీంతో అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ (BJP) సమాయత్తమవుతోంది. ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు కేసీఆర్ రాబోతున్నట్టు వార్తలు రావడంతో ఆసక్తి నెలకొన్నది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశం మీదైనా తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. దీంతో కేసీఆర్ సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారా? లేదంటే హాజరై వెళ్లిపోతారా? అన్నది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఆదివారం బీజేఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు (Ramchander Rao) హాజరు కానున్నారు. బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొననున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను ఎలా బలంగా ప్రస్తావించాలన్న దానిపై రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, హామీల అమలులో వైఫల్యాలు, కీలక ప్రజా సమస్యలపై బీజేపీ (BJP) వైఖరి ఏవిధంగా ఉండాలన్న అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అసెంబ్లీలో పార్టీ పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
Read Also: బంగ్లా హింసపై అసదుద్దీన్ స్పందన.. ఏమన్నారంటే !
Follow Us On : WhatsApp


