ఖమ్మం బైపాస్‌లో గంజాయి బ్యాచ్ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం బైపాస్ రోడ్డులో పోలీసులు (Khammam Police) నిర్వహించిన మెరుపు దాడిలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఐదుగురు యువకులు గంజాయి పొట్లాలతో గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న టూ టౌన్ పోలీసు వాహనాన్ని చూసి వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా నిందితులను ఖమ్మం పట్టణానికి చెందిన యిటిగల సాయి గణేష్, రెంటల ధనుష్ కుమార్, ఎండీ అరీఫ్ అహ్మద్, పోగుల సిద్ధూ, సూర్యాపేటకు చెందిన బత్తుల ఉదయ కిరణ్‌గా గుర్తించారు. వీరంతా స్నేహితులని, కొంతకాలంగా గంజాయి సేవిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.15 వేల విలువైన 250 గ్రాముల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి, శుక్రవారం ఖమ్మం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>