కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలోని చారిత్రాత్మక మరియు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన కరీంనగర్ (Karimnagar) ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ జూనియర్ కళాశాల విజయగాథ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. 1969లో స్థాపించబడిన ఈ కళాశాల తన సుసంపన్నమైన వారసత్వాన్ని ఆధునిక విద్యా ప్రమాణాలతో మేళవిస్తూ విజయపథంలో సాగుతోంది. ఈ విద్యాసంస్థ కేవలం చదువులకే పరిమితం కాకుండా దేశానికే గర్వకారణమైన మహనీయులను ఎందరినో ఈ దేశానికి అందించింది.
భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి. నరసింహారావు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి (సినారె), ఓపెన్ లెర్నింగ్ పితామహుడు ప్రొ. జి. రాంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి ప్రముఖులు ఈ కళాశాల నుంచి రూపుదిద్దుకున్నవారే. ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ స్థానం సాధించి ఈ కళాశాల మరోసారి తన సత్తా చాటుకుంది.
2026-27 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో 715 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 26 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించి అద్భుతం సృష్టించారు. ఈ విజయాల పరంపరలో విద్యార్థులు వ్యక్తిగతంగా కూడా అసాధారణ ప్రతిభ కనబరిచారు. శ్రీరమణి 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో మస్రహా మహవీన్ 438/440 మార్కులతో, జహో మహవీన్ 435/440 మార్కులతో ప్రతిభ కనబరిచారు. అలాగే మొహమ్మద్ రాయాన్ దస్తగిర్ 991/1000 మార్కులు సాధించడంతో పాటు, ఏప్‌సెట్‌లో రాష్ట్ర స్థాయిలో 2147వ ర్యాంక్ సాధించి తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులలో అత్యుత్తమ ర్యాంకును నమోదు చేశారు.
ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఏఈసీ కోర్సులతో పాటు పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ఆధునిక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ ప్రయోగశాలల ద్వారా సాంకేతిక ఆధారిత బోధనను అందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, ఆచరణాత్మక విద్యను అందిస్తున్నారు. చదువుతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాధికారి వి. సత్యవర్ధన్ రావు సమర్థ నాయత్వంలో ఈ కళాశాల విద్య రంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. “చరిత్ర గొప్పదైతే గర్వం కలుగుతుంది… విద్య గొప్పదైతే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నానుడికి ఈ కళాశాల అక్షరాలా నిలువెత్తు రూపంగా నిలుస్తోంది.

