కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలోని శ్రీనివాస్ నగర్లో ఉన్న సాంబశివ రైస్ మిల్ వద్ద శుక్రవారం రైతులు భారీ ఆందోళన (Farmers Protest) చేపట్టారు. ధాన్యం కొనుగోలులో మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని, ధరను ఇష్టారాజ్యంగా తగ్గిస్తోందని ఆరోపిస్తూ రైతులు నిరసన బాట పట్టారు. స్థానిక రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంపై రైతన్నలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడమే కాకుండా, మిల్లు యాజమాన్యం తీరు వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను శాంతింపజేస్తూ మిల్లు యాజమాన్యంతో చర్చలు జరిపారు. పోలీసుల జోక్యంతో మిల్లు యాజమాన్యం దిగొచ్చింది. క్వింటాల్ ధాన్యానికి రూ.3,800 చెల్లించేందుకు రైస్ మిల్లు యాజమాన్యం అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

