కలం, వనపర్తి: ప్రతి కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని వనపర్తి (Wanaparthy) జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి ఎస్పీ పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలన్నారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు, వైద్య ధ్రువపత్రాలు తదితర ఆధారాలను త్వరితగతిన సేకరించి నిర్ణీత గడువులో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు.
శాస్త్రీయ ఆధారాలతో..
పోక్సో, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్ కేసుల దర్యాప్తును శాస్త్రీయ ఆధారాలతో పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీతా రెడ్డి ఆదేశించారు. సీసీటీఎన్ఎస్‌లో కేసుల వివరాలను నిర్ణీత సమయంలో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.
స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని..
గ్రామాల్లో ప్రజలతో సమన్వయం పెంచుకోవడంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సునీతా రెడ్డి సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచి అవసరమైన బైండోవర్ చర్యలు చేపట్టాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. డయల్ 100కు వచ్చే ప్రతి కాల్‌కు తక్షణమే స్పందించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నాకాబందీలు, రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. డీఎస్పీ గిరిబాబు, సీఐలు సుగంధరత్నం, రాంబాబు, శివకుమార్, నరేష్, డీసీఆర్‌బీ ఎస్సై తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్‌బీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

