కలం, ఖానాపూర్: క్రీడాకారులకు ఇచ్చిన హామీని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Bojju Patel) నిలబెట్టుకున్నారు. ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న హాకీ క్రీడా మైదానం (Hockey Ground) గుంతలమయంగా మారి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్రీడా పాఠశాల సందర్శన సందర్భంగా మైదానానికి మరమ్మతులు చేయించి మెరుగుపరుస్తానని ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం పనులు ప్రారంభించారు.
ట్రాక్టర్ సహాయంతో మైదానంలోని గుంతలను పూడ్చి చదును చేసే పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం క్రీడాకారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

