కలం, వెబ్ డెస్క్ : ఏఐతో సెలబ్రిటీలు చాలానే ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఏఐ (AI) టెక్నాలజీని వాడి హీరోలు, హీరోయిన్లు, ఇతర డైరెక్టర్లు, నిర్మాతల మీద అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేయడం ఈ ఏడాదిలో బాగా పెరిగింది. సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలపై పార్లమెంట్ లో కూడా రచ్చ జరిగింది. ఈ ఏఐ అసభ్యకర ఫొటోలు, వీడియోల మీద ఈ ఏడాదిలో ఎంతో మంది సెలబ్రిటీలు (Celebrities) కోర్టులకు వెళ్లారు. తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకున్నారు. మరి ఏఐతో ఇబ్బంది పడ్డ వారు ఎవరు, కోర్టులకు వెళ్లింది ఎవరనేది ఓ లుక్కేద్దాం.
పవన్ కల్యాణ్..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫొటోలు, వీడియోలు, వాయిస్ ను ఏఐతో మార్ఫింగ్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పవన్ పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలు వాడితే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది ధర్మాసనం.
చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి కూడీ డీప్ ఫేక్ వీడియోతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి తన పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్..
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తన ఫొటోలను అసభ్యకరంగా క్రియేట్ చేస్తున్నారని.. తన ఇమేజ్ కు భంగం వాటిల్లుతోందంటూ పిటిషన్ వేయగా.. ధర్మాసనం ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఎన్టీఆర్ ఫొటోలు, పేరు వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నాగార్జున..
సీనియర్ హీరో నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్ వేశారు. ఏఐతో తన పర్సనల్ ఫొటోలు, వీడియోలను అభ్యంతర కరంగా క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది.
ఐశ్వర్యరాయ్..
ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పర్మిషన్ లేకుండా తన పేరును, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ ఫామ్ లలో వాడటంపై నిషేధించాలని ఆమె కోరారు. ఐశ్వర్య పేరుతో అనేక వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో ఐడీలు కూడా ఉన్నాయి. వాటన్నింటితో పాటు తన ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా వాడటంపై ఆమెకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అభిషేక్ బచ్చన్..
సెప్టెంబర్ 12, 2025లో అభిషేక్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫొటోలు, వాయిస్ ను కొందరు ఏఐతో వక్రీకరిస్తూ క్రియేట్ చేస్తున్నారని.. వాటన్నింటీన తొలగించి, సదరు వెబ్ సైట్లు, ఐడీలను బ్లాక్ చేయాలంటూ కోరారు.
రతన్ టాటా..
ఈ ఏఐ వివాదం చివరకు రతన్ టాటాను కూడా వదల్లేదు. రతన్ టాటా చనిపోయిన తర్వాత కొందరు ఆయన ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా ప్రమోట్ చేశారు. దీనిపై టాటా గ్రూప్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్ వేసింది. కోర్టు రతన్ టాటాను ఒక ప్రసిద్ధమైన బ్రాండ్ గా గుర్తించింది. అతని ఫొటోలు, పేరును పర్మిషన్ లేకుండా వాడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఒక జర్నలిస్టు అనధికారికంగా ఓ అవార్డు ఫంక్షన్ లో రతన్ టాటా పేరును వాడటంతో అతనిపై శాశ్వత నిషేధం విధించింది.
అమితాబ్ బచ్చన్..
అమితాబ్ బచ్చన్ కూడా 2023లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును, ఫొటోలను, వాయిస్ ను పర్మిషన్ లేకుండా వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. కోర్టు అమితాబ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
జాకీ ష్రాఫ్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ 2024లో కోర్టును ఆశ్రయించారు. ఆయన కూడా తన పేరును, ఫొటోలను తప్పుగా వాడుతున్నారని చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కోర్టు ఆయన పర్మిషన్ లేకుండా పేరు, ఫొటోలు వాడొద్దంటూ ఆర్డర్ వేసింది.
అనిల్ కపూర్..
అనిల్ కపూర్ తన ఫొటోలు, పేర్లు తప్పుగా వాడుతున్నారంటూ 2023లో కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
సునీల్ శెట్టి..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫొటోలు, వీడియోలను ఏఐతో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని.. దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఆయన పర్మిషన్ లేకుండా ఎలాంటి ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇచ్చింది.
కరణ్ జోహార్..
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫొటోలు, వీడియోలు, వాయిస్ ను ఏఐతో జనరేట్ చేసి వాడటాన్ని నిషేధించాలని కోరారు. కోర్టు ఆయన పర్మిషన్ లేకుండా ఏవీ వాడకుండా ఆర్డర్ చేసింది.
కుమార్ సను..
లెజెండరీ సింగర్ కుమార్ సను కూడా ఏఐతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగతా వారిలాగానే ఆయన కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి.
హృతిక్ రోషన్..
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా ఈ ఏఐ మార్ఫింగ్ వీడియోలతో ఇబ్బందులు పడ్డాడు. ఆయన కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా ఆర్డర్స్ తెచ్చుకున్నారు.
మాధవన్..
నటుడు మాధవన్ కు కూడా ఈ ఏఐతో ఇబ్బందులు తప్పలేదు. కొందరు తన ఫొటోలను అభ్యంతర కరంగా వాడుతున్నారంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నారు.
Read Also: వివాదంలో రాంచరణ్ ‘పెద్ది’
Follow Us On: X(Twitter)


