epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అతడిది ఐరన్​ లెగ్​.. అందుకే బీఆర్​ఎస్​​ ఓటమి: చామల

కలం, వెబ్​ డెస్క్​ : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ రాజకీయ అడుగులు పార్టీకి అరిష్టంగా మారాయని, ఆయనది ‘ఐరన్ లెగ్’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ వరుస ఓటములను చవిచూస్తోందని ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా రావడం కేటీఆర్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. చివరకు కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి సిట్టింగ్ స్థానాలను కూడా పార్టీ కోల్పోయిందని, ఇది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.

మెరిట్ కోటా వర్సెస్ మేనేజ్‌మెంట్ కోటా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుగుదలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు చామల (Chamala Kiran Kumar Reddy) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి స్వశక్తితో జడ్పిటిసిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా గెలిచి మెరిట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. కానీ కేటీఆర్ మాత్రం తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేనేజ్‌మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఉద్యమకారుని వేషం వేసి, పిట్ట కథలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఆ సంపదనంతా తమ కుటుంబానికి మళ్లించుకున్నారని ఆరోపించారు.

హైడ్రా చర్యలకు ప్రజల మద్దతు

హైదరాబాద్‌లో హైడ్రా (Hydraa) చేపడుతున్న కూల్చివేతలపై స్పందిస్తూ.. నగర ప్రజలు ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నారని చామల తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులు, నాళాలు, పార్కులను దండుపాళ్యం ముఠాలా కబ్జా చేసి ఇళ్లు కట్టారని, దీనివల్ల వానాకాలం వస్తే సామాన్య ప్రజల ఇళ్లు మునిగి ఆస్తి నష్టం సంభవిస్తోందని అన్నారు. కబ్జాలకు గురైన ప్రాంతాలను కాపాడటానికే హైడ్రా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

మేడిగడ్డలో బయటపడ్డ అవినీతి

బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో అవినీతిని దేవుడే బయటపెట్టారని చామల వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం అనేది గత ప్రభుత్వ బాగోతానికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ప్రజలకు కనీసం సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మహిళలకు కోటి రూపాయల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా నిలబెట్టడమే నిజమైన మహిళా సాధికారత అని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు దమ్ముంటే రేవంత్ రెడ్డి (Revanth Reddy) విసిరిన సవాల్‌ను స్వీకరించాలని, కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని చామల డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ రాకపోతే, కేటీఆర్ ప్రతిపక్ష నేత హోదా తీసుకుని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు.

Read Also: భారత వ్యతిరేక ఆందోళనల కేంద్రంగా ఢాకా యూనివర్సిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>