తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట.. ఎంపీ అర్వింద్

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) తెలిపారు. రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబంధించి తాను లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో ప్రమాదాల ఆధారంగా మొత్తం 1,513 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 1,308 బ్లాక్ స్పాట్లకు సంబంధించిన శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించిందని తెలిపారు. మరో 205 బ్లాక్ స్పాట్లలో నివారణ చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ రెండు జిల్లాలకు ప్రాధాన్యం

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయన్నారు. మరో 8 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎంపీ (Dharmapuri Arvind) తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు.

రోడ్డు భద్రతా పనులు ముమ్మరం

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని NH-63, NH-61, NH-44 జాతీయ రహదారులపై వంతెనలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు అమలు దశల్లో ఉన్నాయని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణం అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ అర్వింద్ వివరించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, పరిష్కారం చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తామని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం రూ.1,023 కోట్లు కేటాయించిందని ఎంపీ అర్వింద్ తెలిపారు.

Read Also: దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ కుట్ర: రావుల రాంనాథ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>