కలం, వెబ్ డెస్క్ : పొగాకు రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యాచరణ చేపడుతుందని ప్రకటించారు.
మిగిలి ఉన్న పొగాకు పంటను ఎవరు కొనుగోలు చేస్తారో తెలియక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ధర క్వింటాల్‌కు రూ.200 కంటే తక్కువకు పడిపోకుండా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు తగ్గిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరలు పడిపోవడానికి కారణమైన వ్యాపారులు, కంపెనీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ఏ కంపెనీ లైసెన్సును కూడా సస్పెండ్ చేయలేదని, కనీసం ఒక్క వ్యాపారినైనా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చలేదని విమర్శించారు.
పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే రైతులతో కలిసి వైసీపీ తరఫున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Also: ఏపీలో 43.62 లక్షల ఓట్లు గల్లంతు..? YCP షాకింగ్ ట్వీట్!
Follow Us On: Sharechat

