కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో తమకు న్యాయం చేయాలని నిరసన గళం వినిపించిన నీట్ (NEET Exam) పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులపై అమానుషంగా దాడి చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పోలీసుల దాడి వీడియోలను చూపిస్తూ కేంద్ర బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు.
భారత విద్యావిధానాన్ని కేంద్ర బీజేపీ నేతలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే హయాంలో 152 పేపర్ లీకులు జరిగాయని.. 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు. మధ్యతరగతికి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారిందన్న రాహుల్.. దేశ యువతకు మోదీ ప్రభుత్వం భద్రత లేకుండా చేసిందని దుయ్యబట్టారు.
కేంద్ర నిర్వాకం వల్ల పేపర్ల లీకేజీతో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారని అన్నారు. ప్రశ్నించినవారిపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని.. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను రాజీనామా చేయాల్సిందేనన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసిన ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై కేంద్రం ఎలాంటి ఆరోపణలు చేసినా లెక్కచేయనని.. తన పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపైనా బాధపడటం లేదన్నారు. కానీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపైనే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులంటే శత్రువులు, ఉగ్రవాదులు కాదని.. ఆందోళన చేసే యువత ఈ దేశ భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు.

