కలం, హనుమకొండ: పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని మాట్లాడారు. దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా సంస్థల్లో అవకతవకలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

