అశ్వరావుపేటలో కలప దందా కలకలం: అనుమతి ఒకటి.. రవాణా మరొకటి!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట (Aswaraopeta)లో అటవీ సంపదను కంటికి రెప్పలా కాపాడాల్సిన యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతుందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెస్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కలప రవాణా వెనుక భారీ దోపిడీ దాగి ఉందనే నిజాలు క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్నాయి. రికార్డుల్లో కేవలం తక్కువ విలువైన ‘మారు జాతి పుల్ల’ (చిన్న కట్టెలు/పుల్లలు) లోడింగ్ చేస్తున్నట్లు కాగితాలు సృష్టిస్తూ, లారీల్లో మాత్రం అత్యంత విలువైన ‘చింత’ దుంగలను అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

స్థానికులు వెల్లడిస్తున్న కథనం ప్రకారం.. కాంట్రాక్టర్లు తక్కువ రుసుము ఉండే ‘మారు జాతి పుల్ల’ పేరుతో రవాణా అనుమతులు పొందుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పద్ధతి ప్రకారం పర్యావరణ సమతుల్యతకు ఎంతో కీలకమైన భారీ చింత చెట్లను నరికివేస్తున్నారు. అధికారులు లేని సమయాన్ని, రాత్రి వేళలను ఆసరాగా చేసుకుని లారీల్లో చింత దుంగలను దట్టించి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. అనుమతి ఒకదానికి తీసుకుని రవాణా మరొకటి చేస్తుండటంతో ప్రభుత్వ రాబడికి కోట్లాది రూపాయల గండి పడటమే కాకుండా, అటవీ సంపదకు పెద్ద కోత పడుతోందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడవిలో నిత్యం ఇంత పెద్ద ఎత్తున చింత చెట్ల నరికివేతలు, కలప అక్రమ రవాణా (Timber Scam) జరుగుతున్నా సంబంధిత తనిఖీ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో నిఘా లోపించిందా లేక అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కు అయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనిఖీలు చేపట్టాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ దోపిడీ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మారు జాతి పుల్లల లోడింగ్ పేరిట ఇచ్చిన అనుమతి పత్రాలు, డిపోల రికార్డులు, చెక్‌పోస్టుల రవాణా ఆధారాలను బహిర్గతం చేయాలని కోరుతున్నారు. జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రూ.56 కోట్లతో హనుమకొండలో అభివృద్ధి పనులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>