కలం, హనుమకొండ: హనుమకొండలో (Hanamakonda) రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ వసతుల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. వాజ్పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, నూతన కార్యాలయం, టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ కాలనీలో 33/11 కేవీ సబ్స్టేషన్, కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
ఈ పనులతో హనుమకొండ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగనుందని, వోల్టేజ్ సమస్యలు తగ్గనున్నాయని భట్టి తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

