రాజగోపాల్ రెడ్డి ‘రాజీ’.. రూటు మార్చిన మునుగోడు ఎమ్మెల్యే!

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Raj Gopal Reddy)లో భయం పుట్టిందా? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన గ్రహించారా?.. అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తున్నది.

సీఎం నకిరేకల్ సభలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షం కావడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి గతంలో హాజరైన నల్లగొండ, యాదగిరిగుట్ట ప్రోగ్రామ్‌లకు దూరంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. హఠాత్తుగా నకిరేకల్ బహిరంగ సభకు హాజరు కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

బలాన్ని నిరూపించుకునే తరహాలో మునుగోడు నుంచి అనుచరులను, కేడర్‌ను తీసుకురావడం.. ముఖ్యమంత్రి ఆయన పేరును ప్రస్తావించగానే ఈలలు, సందడితో అందరి దృష్టిని ఆకర్షించే తరహా ప్రయత్నాలు చేయడం.. పార్టీ లీడర్లను, శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవడంతో ఇక తనపైనా ఏదో ఒక రూపంలో హైకమాండ్ ఆగ్రహం తప్పదని గ్రహించే రాజగోపాల్ రెడ్డి రాజీకి వచ్చినట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.

సీఎం టీమ్‌లో చేరిక!

ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇంతకాలం విమర్శించిన రాజగోపాల్‌రెడ్డి నకిరేకల్ సభకు హాజరై హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సభకు హాజరుకావడం ద్వారా ఇకపై విమర్శలు చేయనని, తాను ముఖ్యమంత్రితోనే ఉంటాననే మెసేజ్ ఇచ్చినట్లయిందన్నది జిల్లా శ్రేణుల అభిప్రాయం.

పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని ఏఐసీసీ నుంచి పీసీసీ వరకు ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో రాజీ మార్గమే శ్రేయస్కరమనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐసీసీ దగ్గర ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటు అవుతున్నందున ఆయన టీమ్‌లో ఉండడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకుంటే పార్టీలో క్రమశిక్షణ గాడిన పడుతుందంటూ ముఖ్యమంత్రి ఊహించినట్లుగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ‘నా రూటే సెపరేట్’ అనే తీరులో ఇంతకాలం వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజీ పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>