కలం, తెలంగాణ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ (AI Data Center Campus)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంఓయూపై సంతకాలు జరిగాయి. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్, భాగస్వామ్య సంస్థలు కలిపి దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు, హైపర్ స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్ప్రైజ్‌లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ వసతులను ఈ డేటా సెంటర్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలతో పాటు లిక్విడ్ కూలింగ్ వంటి అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు.
చారిత్రాత్మక ప్రాజెక్టు: సీఎం
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకే కాకుండా దేశానికి ఇదో చారిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన టీసీఎస్ ప్రతినిధులను సీఎం అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు బలమైన పునాది వేస్తుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047లోని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఇది కీలక ముందడుగని వివరించారు.
– సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ సంజయ్ జాజుతోపాటు టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్, సీవోవో ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈవో, ఎండీ దీపేష్ నందా హాజరయ్యారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు పాల్గొన్నారు.
దావోస్‌లో సీఎం భేటీతో మొదలై..
– ఈ భారీ ప్రాజెక్టుకు దావోస్‌లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భేటీతో పునాది పడింది. 2026 జనవరిలో జరిగిన ఈ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి.
– అనతికాలంలోనే ప్రాజెక్టు ఎంఓయూ దశకు చేరుకుంది. దేశంలోని మరో ఐదు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ.. చివరకు తెలంగాణను వేదికగా ఎంచుకున్నారు.
– ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునివ్వనుంది. ఏఐ, డేటా సెంటర్లతోపాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాలకూ భారీ అవకాశాలు తెరుచుకోనున్నాయి.

