కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ షట్లర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. జపాన్ ఓపెన్ 2026 ఫైనల్లో స్థానిక ఫేవరెట్, మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అకానె యమగూచిని వరుస సెట్లలో ఓడించి సింధు ఈ ఘనత సాధించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఆమె పూరీ జగన్నాథ స్వామికి అంకితం చేసింది.
ఒడిశాలో పవిత్రమైన జగన్నాథ రథయాత్ర జరుగుతున్న సమయంలోనే ఈ విజయం రావడం ఎంతో సంతోషంగా ఉందని సింధు పేర్కొంది. సింధు చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. ఫైనల్లో సింధు అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశానికి మరిన్ని విజయాలు, కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సింధు భావోద్వేగ స్పందన
మాజీ సీఎం అభినందనలపై సింధు ఎంతో భావోద్వేగంతో స్పందించింది. సీనియర్ బ్యూరోక్రాట్‌గా పనిచేసిన తన మామగారు నవీన్ పట్నాయక్ నాయకత్వాన్ని, పరిపాలనను ఎప్పుడూ గొప్పగా చెప్పేవారని గుర్తుచేసుకుంది. రథయాత్ర సమయంలో తనకు ఈ విజయం దక్కడం దైవ సంకల్పంలా ఉందంది. త్వరలోనే పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పింది. తన విజయానికి శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు వ్యక్తపరిచింది.
సుదీర్ఘ నిరీక్షణకు తెర
సింధు కెరీర్‌లో ఈ విజయం ఎంతో కీలకమైంది. బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ టూర్ టైటిల్ కోసం ఆమె రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. 2022 మే నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టైటిల్ గెలిచిన తర్వాత, పెద్ద టోర్నీల్లో ఆమెకు ఇదే మొదటి పెద్ద విజయం. అలాగే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత ఏడేళ్లకు ఒక మేజర్ టైటిల్ దక్కించుకుంది. ఈ జపాన్ ఓపెన్ సూపర్ 750 విజయం సింధుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే న్యూఢిల్లీ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆమె బలమైన పోటీదారుగా నిలిచింది.

