కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటన (Unnao Rape Case) లో నిందితునికి జైలు శిక్ష రద్దు కావడంపై సుప్రీకోర్టును ఆశ్రయించనున్నట్లు బాధితురాలు తెలిపారు. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్(Kuldeep Singh Sengar)కు విధించిన జీవితఖైదును మంగళవారం ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై బుధవారం బాధితురాలు స్పందించారు. నిందితునికి శిక్ష రద్దు కావడం తమను ఎంతగానో బాధించిందని, ఇది తమ కుటుంబానికి మరణశాసనం వంటిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందితుడు అత్యాచారం చేసిన సమయంలో తాను మైనర్‌నని గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాక్షులకు అందించిన భద్రత ఇప్పటికే తొలగించారని, ఈ తీర్పు తమ భయాలను మరింత పెంచిందని ఆమె అన్నారు. ‘ఇంతటి దారుణమైన కేసుల్లో దోషులకు బెయిల్ ఇస్తే, ఈ దేశంలో ఆడపిల్లలు ఎలా సురక్షితంగా ఉంటారు? ఈ నిర్ణయం మాకు మరణశాసనం వంటిది. డబ్బున్నవాళ్లే గెలుస్తున్నారు. డబ్బు లేనివాళ్లు ఓడిపోతున్నారు’ అని ఆమె తీవ్ర ఆవేదనతో వాపోయారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన తల్లితో కలసి నిరసన చేయనున్నట్లు వెల్లడించారు. శిక్ష రద్దు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
కాగా, ఉన్నావో దారుణ అత్యాచార ఘటన (Unnao Rape Case) లో నిందితుడైన కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను మంగళవారం ఢిల్లీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ కేసులో నిందితునికి కొన్ని కండిషన్లతో బెయిల్ కూడా ఇచ్చింది. బాధితురాలు నివసిస్తున్న ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి నిందితుడు వెళ్లరాదని; ఆమెను, ఆమె తల్లిని బెదిరించరాదని షరతులు విధించింది. ఒకవేళ అలా చేస్తే బెయిల్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని చెప్పింది. అయితే, ఈ కేసులో శిక్ష రద్దు అయినప్పటికీ.. బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణంలో విధించిన 10 ఏళ్ల జైలు శిక్ష కొనసాగుతున్నందున, ఆ కేసులో బెయిల్ రానందున కుల్దీప్ సింగ్ సింగార్ జైలులోనే ఉండనున్నాడు. మరోవైపు ఉన్నావో అత్యాచార, అనుబంధ కేసులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 ఆగస్టులో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యాయి.
Read Also: హిందువులు కూడా నలుగుర్ని కనాలి -నవనీత్ కౌర్
Follow Us On: Youtube


