Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం రైతు మేళాలో భట్టి కీలక వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం(Khammam) జిల్లాలో పొలాలకు చేరుతున్న ప్రతి నీటి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో, ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ఫలితమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఇతర పార్టీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో గురువారం నిర్వహించిన మెగా రైతు మేళా(Mega Rythu Mela) బహిరంగ సభలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రతి కుటుంబం భూమితో అనుబంధం కలిగి ఉందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.

రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సత్తుపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలతో కలిసి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతే దేశానికి వెన్నుముక అనే నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రాంతానికి రానుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా నియోజకవర్గంలోని ప్రతి రైతు కుటుంబం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>