Mobile Popup Ad
Mobile Popup Ad

1,400 కోట్ల బీఆర్ఎస్ అవినీతి సొమ్మును అమరులకు పంచాలి: కవిత డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: నేను సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజాపక్షాన నిలబడి నా పని నేను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటివరకు బీఆర్ఎస్ వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన మొదటి ఆరు నెలలపాటు ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చానని తెలిపారు. కానీ, తమ పార్టీతో ఎలాంటి భయం లేదంటూనే, తెరవెనుక బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు పంపారని కవిత మండిపడ్డారు. ఈ ఫిర్యాదులు బీఆర్ఎస్ భయానికి నిదర్శనమన్నారు. తమ పార్టీకి సంబంధించిన వార్తలను కవర్ చేసే జర్నలిస్టులకు సిగ్గులేకుండా గుంటనక్కల్లా ఫోన్లు చేస్తూ, వార్తలు రాయవద్దని బెదిరింపులకు గురిచేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

జోడెద్దులు కాదు..అంబోతులు

డబ్బు బలంతో సోషల్ మీడియాను, ప్రధాన మీడియాను కొనుగోలు చేసి తమ గొంతు నొక్కాలని చూస్తున్నారా? అని కవిత  ప్రశ్నించారు. ఇటీవల రూ. 188 కోట్లు పెట్టి కేటీఆర్ (KTR) పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. క్విడ్ ప్రొ కో ఒప్పందాల్లో భాగంగా తన మిత్రుడికి చెందిన ప్రదీప్ కన్‌స్ట్రక్షన్‌కు అక్రమంగా అనుమతులు ఇచ్చారని కవిత ధ్వజమెత్తారు. పార్టీని బాధ్యతగా, జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే నేడు అంబోతుల్లాగా సిగ్గులేని వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అసలు నీతి, నియమం అంటే లేకుండా చేస్తున్నారని కవిత అన్నారు. ఒక రాజకీయ పార్టీగా తమ విధానాలను ప్రజలకు చెప్పుకుంటూ, ప్రజా పోరాటాలు చేసుకునే కనీస హక్కు లేదా? అని ఆమె నిలదీశారు.

బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు

తెలంగాణ ఉద్యమకారుల కోసం తాము పోరాటం చేస్తుంటే, ఆ వార్తలు బయటకు రాకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని కవిత (Kavitha) ప్రశ్నించారు. “మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తుంటే, మేం వారి తరఫున పోరాడటం మీకు సమస్యగా మారిందా?” అని అడిగారు. అసలు బీఆర్ఎస్ అకౌంట్‌లో ఉన్న రూ. 1400 కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము కాదా అని ప్రశ్నించారు. ఆ అకౌంట్‌లోని డబ్బును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తలా ఒక కోటి రూపాయల చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ ఒంటరిగా, ధైర్యంగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంటే ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తారా అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో ప్రజా సమస్యల పోరాటంలో పోటీ పడాలని సవాల్ విసిరారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అవినీతిని మొత్తం కక్కిస్తా

రాష్ట్రంలో భూముల దోపిడీపై స్పందిస్తూ, ఫినిక్స్ సంస్థకు రూ. 80 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారని, ఆ సంస్థ యజమాని ఆంధ్రావాడా? తెలంగాణావాడా? అని ప్రశ్నించారు. సదరు సంస్థ ఏకంగా 33 లక్షల టన్నుల కలపను అక్రమంగా కొట్టేస్తుంటే, గతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పెట్టిన కేసులను సైతం ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పనంగా అప్పగించిన భూములన్నింటిపైనా సమగ్ర రివ్యూ జరిపి, మొత్తం అవినీతిని కక్కిస్తామని కవిత హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>