కలం, నల్లగొండ బ్యూరో: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) క్యాంపస్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాగునీరు, వాడుక నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినులు అర్ధరాత్రి రోడ్డెక్కారు. దాదాపు ఒంటి గంట సమయంలో హాస్టల్ నుండి బయటకు వచ్చిన వందలాది మంది విద్యార్థినులు వైస్ ఛాన్స్ లర్ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
నీళ్లు లేక నిద్ర లేని రాత్రి..
గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో తాగునీటితో పాటు వినియోగ నీటి కొరత తీవ్రంగా ఉందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. “హాస్టల్‌లో కనీసం తాగడానికి నీళ్లు లేవు, వాష్ రూమ్‌లకు వెళ్లాలన్నా చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నరకప్రాయమైన వాతావరణంలో ఎలా ఉండాలి?” అంటూ విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి వేళల్లో కూడా నీటి సరఫరా పునరుద్ధరించకపోవడంతో, విసిగిపోయిన విద్యార్థినులు అర్ధరాత్రి నిరసన బాట పట్టక తప్పలేదని స్పష్టం చేశారు. బాలికల హాస్టల్‌కు రావాల్సిన నీటిని, క్యాంపస్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు మళ్లించారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్లే హాస్టల్‌లో ఈ విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడిందని విద్యార్థి సంఘాల నేతలు, నిరసనకారులు మండిపడుతున్నారు.
మెస్ నిర్వహణ అస్తవ్యస్తం.. అధికారుల నిర్లక్ష్యం..
నీటి సమస్యతో పాటు హాస్టల్ మెస్ నిర్వహణ కూడా అత్యంత అధ్వానంగా తయారైందని విద్యార్థినులు ఆరోపించారు. నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కేర్‌టేకర్లు, వార్డెన్ల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పలుమార్లు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు తక్షణమే స్పందించకపోవడం వల్లే విద్యార్థినులు అర్ధరాత్రి వీధుల్లోకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
గతంలో క్యాంపస్‌లోని నీటి సమస్యపై వీసీని నిలదీసినందుకు, ప్రశ్నించిన విద్యార్థులపై యాజమాన్యం పోలీస్ కేసులు కూడా పెట్టించినట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు న్యాయమని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. హాస్టల్‌లో మౌలిక వసతుల వైఫల్యంపై, నీటి మళ్లింపు ఆరోపణలపై తక్షణమే ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యార్థినులను అర్ధరాత్రి రోడ్డెక్కేలా చేసిన నిర్లక్ష్యపూరిత కేర్‌టేకర్లు, వార్డెన్ల, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తాగునీరు, మెస్ సమస్యలకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలి. “కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం” అని విద్యార్థినులు హెచ్చరించారు.

