కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి నామినేటెడ్ పదవుల (Warangal Nominated Posts) చుట్టూ తిరుగుతున్నాయి. వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఆశావహులు హైదరాబాద్లో మకాం వేసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతల్లో నామినేటెడ్ పదవుల్లో నియమించింది. ఉమ్మడి జిల్లాకు మాత్రం తొలి విడతలోనే ఆరుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది. కాకతీయ కార్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి పరకాలకు పార్టీ సీనియర్ నేత ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్, గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ పదవి సీనియర్ నేత రాఘవరెడ్డి, మరో సీనియర్ నేత, ఉద్యమకారుడు రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా నియమించింది.
మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించిన సీనియర్ నేత బెల్లయ్యనాయక్ ను గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలలప్ మెంట్ కార్పొరేషన్ (ట్రైకా) చైర్మన్, ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా, అప్పటి భూపాలపల్లి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డిని స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందారు. వీరి పదవీకాలం మంగళ వారంతో ముగిసింది. రెండోసారి పదుల సంఖ్యలో నేతలు ఆశిస్తుండగా ఎవరికి ప్రకటించకపోగా ఆశావహులు అసంతృప్తితో ఉన్నారు.
ఒక్క చాన్స్ ప్లీజ్..!
మరోసారి చాన్స్ కోసం చైర్మన్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి కొద్దిరోజుల కింద హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. దీంతో ఒకరికి రెండు పదవులు ఎందుకనే వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కానీ, ఆయన ప్రొటోకాల్ కోసం మరోసారి రెన్యువల్ కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోదెం వీరయ్యకు కూడా రెన్యువల్ అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. బెల్లయ్యనాయక్ ను కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించవచ్చనే ప్రచారంలో ఉంది.
ఇదే జరిగితే రెన్యువల్ ఉండకపోవచ్చని, లేదంటే మరోసారి అవకాశం దక్కనుందని తెలుస్తున్నది. జంగా రాఘవరెడ్డి వరంగల్ మేయర్ పదవిని ఆశిస్తున్నారని, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెన్యువల్ ఉండదని సమాచారం. ప్రకాష్ రెడ్డితో పాటు రియాజ్ కు కూడా మరో చాన్స్ ఇవ్వాలని అదిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికీ పలువురు చైర్మన్లు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ను కలిసి రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరించటంతో పాటు మరో చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఆరుగురిలో ఎవరి చైర్మన్ పదవి రెన్యువల్ అవుతుంతో ఎవరి పదవి ఊడుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది
ఇద్దరికి రెన్యూవల్.. ముగ్గురికి కొత్తగా చాన్స్ !
ప్రస్తుతం ఉన్నవారిలో ఇద్దరికి మాత్రమే రెన్యూవల్ అయ్యే అవకాశం ఉందని, మిగతా పోస్టుల్లో కొత్త నేతలను ప్రోత్సహించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్లు తెలిసింది. కుడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి తమ అనుచరుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రామసహాయంతో కొందరు నేతల అనుచరులు ప్రత్యేకంగా సమావేశమై కుడా చైర్మన్ పదవిపై చర్చించినట్లు సమాచారం.
మేయర్ అభ్యర్థి ఎంపికలో ఉత్తమ్ ఎంట్రీ ?
మేయర్ అభ్యర్థి ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. అభ్యర్థిని ఎంపికను మంత్రి ఉత్తమ్ అభిప్రాయానికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందనే ప్రచారం ఉంది. స్థానిక రాజకీయాలు, సామాజిక సమీకరణాలు, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కుడా చైర్మన్ పోస్టు, మేయర్ అభ్యర్థి కోసం ఆశావహులు రాష్ట్ర స్థాయి నేతలను వరుసగా కలుస్తున్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అనుచరులకు పదవులు దక్కేలా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీలో సీనియారిటీ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు, పనితీరు, భవిష్యత్ రాజకీయ అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. నియామకాలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త నేతలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

