కలం, ఖమ్మం బ్యూరో: సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకొచ్చే స్మగ్లర్ల ఆస్తులను ఇక నుంచి జప్తు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఆఫ్ తెలంగాణ (T-MARS)ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మంగళవారం ఖమ్మం కమిషనరేట్‌ను సందర్శించిన డీజీపీ, పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ నిర్వహించారు.
వారికి ప్రవేశ ద్వారంలా ఖమ్మం..
అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. నేరగాళ్లపై ‘స్ట్రాంగ్ పోలీసింగ్’ నిర్వహిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేయడానికి ఖమ్మం జిల్లా ప్రవేశ ద్వారంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రక్షణ కవచంలా సరిహద్దు జిల్లాలు..
సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు జిల్లాలను రక్షణ కవచంలా మార్చి ఎంట్రీ పాయింట్లను పూర్తి స్థాయిలో బ్లాక్ చేస్తామని డీజీపీ తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్స్, స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
స్కూళ్లు, పాన్ డబ్బాల వద్ద మత్తు పదార్థాల విక్రయాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిపై ప్రజలు, మీడియా, సోషల్ మీడియా సహకారంతో యుద్ధంలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించడానికేనని, నేరగాళ్లను ఉపేక్షించడానికి మాత్రం కాదని గుర్తు చేశారు.
రూ.42 కోట్లు పోగొట్టుకున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకురాబోతున్న ‘T-MARS’ ద్వారా హైవేలపై అక్రమ పార్కింగ్ లారీలు నియంత్రించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచడం, సీట్ బెల్ట్, హెల్మెట్ నిబంధనలను ఒకే పద్ధతిలో కఠినతరం చేయాలని డీజీపీ సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో దాదాపు రూ.42 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాపారం చేసేవారు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లతో మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. దీనిపై నిఘా ఉంచేందుకు ఖమ్మంలో సైబర్ క్రైమ్ సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీసింగ్‌లో ఏఐ వినియోగం..
సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో తెలంగాణ పోలీస్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) వెల్లడించారు. త్వరలోనే సీసీటీఎన్ఎస్ 3.0, జి-కాప్ 3.0, ఆర్కైవ్ 3.0ను తీసుకురావడంతో పాటు పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో జరిగిన దొంగతనాలు, బాలికపై అఘాయిత్యం కేసు, రామారావు హత్య కేసుతో పాటు రూ.600 కోట్ల క్రిప్టో కరెన్సీ సైబర్ ఫ్రాడ్ వంటి కేసులపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాల గుర్తింపు
Follow Us On: X(Twitter)

