కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అత్యవసర విభాగం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పి.సురేశ్ మాట్లాడుతూ, జీతాలు పెరగక అర్ధాకలితో అలమటిస్తున్న ఆసుపత్రి కార్మికుల ఆకలి కేకలు, గోసలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు అందించాలని, జాతీయ, పండగ,ఆర్థిక 23 సెలవులు మంజూరు చేయాలన్నారు. బోనస్ చట్ట ప్రకారం ఒక నెల వేతనాన్ని కార్మికులకు బోనస్ గా అందించాలని, కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకు నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు చాలీచాలని వేతనాలతో దశాబ్దాల తరబడి వెట్టి చాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల కాల వ్యవధి ముగిసిన పాత ఏజెన్సీలను రద్దు చేయకుండా ప్రభుత్వం పాత ఏజెన్సీ నిర్వాహకులకే కాల వ్యవధి పెంచుతూ అనుమతులు ఇవ్వడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు వేతనాలు పెంచాలని విజ్ఞప్తులు చేసిన పట్టించుకోని పరిస్థితుల్లోనే మూడు రోజులు ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వచ్చిందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ అధ్యక్షుడు రంగన్న, ప్రధాన కార్యదర్శి ఎస్.దేవానంద్, సీనియర్ నాయకులు బి.చెన్నయ్య, మొగులయ్య, నేతలు బాలరాజ్, జే. నరసింహ, అంజి, లోకేష్, యాదయ్య, శ్రీనివాస్, అంజలయ్య, యాదిగిరి, నైసన్, నరేష్, రాఘవేందర్, పద్మ, నాగమణి, లక్ష్మమ్మ, మల్లమ్మ, శిరీష, చంద్రకళ, జ్యోతి, నిర్మల, యాదమ్మ, కవిత, పద్మ, జమున, సాయమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాల గుర్తింపు
Follow Us On : WhatsApp

