Mobile Popup Ad
Mobile Popup Ad

దర్జీలకు అండగా ప్రజాప్రభుత్వం: విప్ బీర్ల అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం వెనుకబడిన కులాలన్నింటికీ అండగా ఉంటుందని, దర్జీల (మేర) సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) స్పష్టం చేశారు. తన గెలుపులో మేర కులస్థులే కీలక పాత్ర పోషించారని, వారే నా బలమని ఆయన కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించిన మేర కుల సంక్షేమ భవనాన్ని ఆదివారం మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్ రాజాంతో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన బాంకెట్ హాల్‌ను ప్రారంభించారు. అంతకుముందు మేర కుల సంక్షేమ భవనం ట్రస్ట్ చైర్మన్ పురుషోత్తం, ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. మేర కుల సోదరులు కష్టపడి ఈ సంక్షేమ భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాలు మేర కులాన్ని పూర్తిగా విస్మరించాయని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేర కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ కులానికి సముచిత గౌరవం కల్పించిందని గుర్తుచేశారు.

మేర కుల ట్రస్టు సభ్యుల విజ్ఞప్తి మేరకు.. ఈ సంక్షేమ భవనం సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రకటించారు. భవిష్యత్తులో మేర కార్పొరేషన్‌కు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక కాలంలో రెడీమేడ్ దుస్తుల వల్ల దర్జీలకు సవాళ్లు పెరిగినప్పటికీ, యువత ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్, డిజిటల్ టైలరింగ్, బొటిక్ నిర్వహణ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. మహిళలు కూడా కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్ రాజాం, స్థానిక ప్రజాప్రతినిధులు, మేర సంఘం నాయకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>