కలం, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) పార్టీ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మేడ్చల్ (Medchal)లో జరిగిన ఓ కార్యకర్త పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మల్లారెడ్డి తాను బీఆర్ఎస్‌కు దూరం అయినందుకు తనను అందరూ మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. కొద్ది నెలలుగా మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారని తీవ్ర ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి సైతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.
అదే సమయంలో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతున్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే ప్రీతి రెడ్డి దీన్ని పూర్తిగా ఖండించారు. తాను కేవలం మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ గురించి మాట్లాడేందుకు, వర్సిటీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బీజేపీ పెద్దలను కలిసినట్లు చెప్పారు. అలాగే అన్ని పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. దీనికి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. కానీ, మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, తాజాగా పార్టీకి దూరమయ్యాయని చెప్పడం పార్టీ మార్పు ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఇక కొద్ది రోజుల్లో మల్లారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని మేడ్చల్‌లో చర్చ నడుస్తోంది.

