కలం, స్పోర్ట్స్: ఆసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో (Table Tennis Championship) భారత్ తన సత్తా చాటింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్ షిప్‌లో మొత్తం నాలుగు పతకాలను సాధించింది భారత్. చివరి రోజు బాలికల అండర్-19 డబుల్స్‌లో సిండ్రెలా దాస్, దివ్యాంశి భౌమిక్ జోడీ రజత పతకం సాధించింది. ఫైనల్లో జపాన్‌కు చెందిన తకహాషి ఆయోబా, టకేయా మిసుజు జోడీతో భారత జంట హోరాహోరీగా పోరాడింది. అయితే 14-16, 11-7, 11-9, 3-11, 6-11 తేడాతో ఓటమి పాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకుంది.
అంతకుముందు జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్‌లో సిండ్రెలా దాస్ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీఫైనల్లో హాంకాంగ్‌కు చెందిన సుత్స్ టుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది భారత జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ రన్నరప్‌గా నిలిచిన సిండ్రెలా, ఈ టోర్నీలో కూడా మంచి ప్రదర్శన చేసింది. భారత్‌కు మరో రెండు కాంస్య పతకాలు కూడా లభించాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో దివ్యాంశి భౌమిక్, అభినంద్ పీబీ జోడీ సెమీఫైనల్లో థాయ్‌లాండ్ జంట చేతిలో ఓడి కాంస్యం దక్కించుకుంది.
అండర్-19 బాలుర జట్టు విభాగంలో అభినంద్ పీబీ, ప్రియానుజ్ భట్టాచార్య, రాజశేఖరన్ బాలమురుగన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో చైనా చేతిలో 1-3తో ఓడింది. ఈ మ్యాచ్‌లో అభినంద్ మాత్రమే తన సింగిల్స్ పోరులో విజయం సాధించాడు. మొత్తంగా భారత్ ఈ టోర్నీని ఒక రజతం, మూడు కాంస్య పతకాలతో విజయవంతంగా ముగించింది.

