కలం, వెబ్డెస్క్: ప్రతిఒక్కరూ తమ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చుండ్రు (Dandruff). ఈ సమస్య జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. చుండ్రు సమస్య వల్ల జుట్టు రాలడంతో పాటు తలపై దురద కూడా వస్తుంది. అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు.
చుండ్రు సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు. జుట్టు కుదుళ్లను సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం, హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులు, వాతావరణంలో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో చుండ్రు సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు (Dandruff Control Tips). అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, నిమ్మరసం ప్యాక్
జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించేందుకు, జుట్టు రాలడాన్ని నివారించేందుకు నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. నిమ్మరసంతో పెరుగు కలిపి పెట్టుకోవడం వలన చుండ్రు సమస్య కొంత వరకు తగ్గుతుందని చెబుతున్నారు. దీనికోసం 4 టేబుల్ స్పూన్ల హెన్నాపొడిని తీసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత పెరుగు వేస్తూ మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. రెండు వారాలకు ఒకసారి ఈ ప్యాక్ వాడటం వలన చుండ్రు సమస్య తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
మందారం పువ్వులు, ఆకులు
జుట్టు సమస్యలను తగ్గించడంలో మందారం పువ్వులు, ఆకులు ఎంతో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. దీని కోసం 4 టేబుల్స్పూన్ల హెన్నా పొడిని తీసుకోవాలి. దీంట్లో బాగా ఎండబెట్టి పొడి చేసిన మందార పువ్వులు, ఆకుల పొడిని కొద్దిగా వేయాలి. అలాగే కొద్దిగా ఉసిరి పొడి, మెంతుల పొడిని కూడా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ మృదువైన మిశ్రమం వచ్చేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
మెంతుల ప్యాక్
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. 4 టేబుల్స్పూన్ల హెన్నా పొడిని తీసుకోవాలి. దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, పెరుగు వేయాలి. తర్వాత ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున మెంతిపొడి, వెనిగర్, ఆలివ్ నూనె వేయాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. రెండు లేదా మూడు గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు.

